Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page

జీవితం నేర్పిన పాఠాలు

జీవితం అవిరామంగా క్రొత్త క్రొత్త పాఠాలను నేర్పడానికి యత్నిస్తూనే వున్నది. కాని తీరా చూస్తే నేను నేర్చుకొన్న దేమి కన్పించదు. వివిధములైన అనుభవాలను విమర్శ పూర్వకంగా పరిశీలించే అభ్యాసం లేకపోవటంచేత, అనుభవపాఠం అంతంతలో ఉండిపోయినది. గతచరిత్ర విస్మరిస్తే బాల్యంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తున్నవి. మొదటిది నాకు ఏ మూడు నాలుగేళ్ళో ఉన్నప్పుడు జరిగినది. ప్రతి ప్రాణికీ ఆశ, మోసమూ, కష్టమూ, నష్టమూ వల్ల కలిగే భయానక పరిణామాన్ని అనుభవం నేర్పింది.

ఒకరాత్రి వీధుల్లో తిరిగే కుక్క ఒక ఇంటిలోనికి దూరింది. ఉట్టిలో బెల్లంఉన్న రాగిచెంబు ఒకటిఉంటే అందులో తలను దూర్చింది. తలతీయబోతే రాలేదు. చెంబులో తలతగులుకోగా అవస్థపడుతూ అటూ ఇటూ పరుగిడితూ సందడి చేస్తున్నది. ఇంటివారూ, ఇరుగు పొరుగువారూ, దొంగ ఎవడో జొరబడ్డాడని అనుకొని భయపడ్డారు. గదిలోనుండి ఒకటే సందడి వినవస్తున్నది. కొందరు ధైర్యంచేసి కర్రల్ని చేతబట్టుకొని, దీని అంతు తెలిసికొందామని, తలుపులు తెరచి లోనికి వెళ్ళారు. దొంగకుబదులు కుక్కకనబడింది. దానిని ఒక గుంజకుకట్టి బలవంతంగానూ, నేర్పుగానూ, తలను చెంబులోనుంచి లాగారు. ఏదో ఒక విధంగా ప్రాణాలు దక్కించుకొని ఆకుక్క పారిపోయింది. ఏప్రాణికిన్నీ ఆశ అనేది ఎంతటి ఆపదను తెచ్చి పెడుతుందో ప్రత్యక్షంగా అపుడు తెలిసింది.

ఇంచుమించు అదే ప్రాయంలో ఒంటరిగా ఉన్నాను. ఆరోజులలో నేతులకు బంగారు మురుగులుండేవి. నా మురుగులుచూచి, నా ఒంటరితనం గమనించి, ఒకడు లోనికివచ్చి చొరవగా నా చేయి పట్టుకొన్నాడు. వాని ఉద్దేశం నాకు అగమ్యంగా ఉన్నది. ''చూడు ఇవి నాకు చాలా వదులుగా ఉన్నాయి. వీనిని తీసుకువెళ్ళి కాస్త బిగించి తీసుకురా. ఏం? త్వరగా తీసుకొని రావాలిమరి?'' అని ఆఅపరచితుణ్ణి అధికార పూర్వకంగా ఆజ్ఞాపించాను. వాడున్నూ ఆజ్ఞను తలదాల్చి మురుగును తీసుకొని మహావినయంగా సెలవు పుచ్చుకొన్నాడు.

ఆభరణాల మరమ్మత్తును అంతసులభంగా ఏర్పాటుచేసిన నాసంతోషం పట్టలేక లోనికిపోయి ఈవార్తను చల్లగా చెప్పినాను. వాని పేరుకూడా అడిగి తెలుసుకొన్నాను. పేరు పొన్ను స్వామియట (బంగారయ్య లేక బంగారుసామి.) ఇంటివారు ఆదరాబాదరా పరుగిడిరాగా, ఆసరికి బంగారయ్య బంగారంతో మాయమైనాడు.

ఈ అనుభవాలు చాలు చిన్న వయస్సులో జరిగినవి. ఇట్టివే ఇప్పటికీ, ఏదో ఒకరూపంలో మరల మరల దర్శనమిస్తున్నవి. వృద్ధాప్యం దాపురించి వయస్సు డెబ్బదికి చేరుతున్న సులభంగా నేను మోసపోతున్నాను. ఏదో లాభానికి అడ్డుదారి వేయాలని ఆశపడుతూనే ఉన్నాను.

ఈ ఆశ అనే మానదండంతో ఈ ప్రపంచం కొలవబోతే ఆ గణన సునిశితంగా ఉండదు. కాని అలాంటి పరీక్షలో తేలేదేమిటంటే, స్వార్థరహితమైన భావాలుకల జనులు ఉన్నారా అంటే దాదాపు లేనే లేరని చెప్పవలసి వస్తుంది.

ఐతే సంవత్సరాలు గడిచేకొద్దీ లోకాన్ని చూస్తుంటే ఈభూమిలో కూడా కొంతమంది ధర్మమార్గంలోనూ, నైతికపథంలోనూ సుస్థిరంగా అడుగులువేస్తూ తమ సౌఖ్యాలను, సాధనానుకూలులనూ లెక్కచేయకుండా, జీవిత సర్వస్వాన్ని పరార్ధానికీ, లోకకల్యాణానికీ అంకితంచేస్తున్నా రన్న అభిప్రాయంకూడా కల్గుతున్నది.

1905వ సంవత్సరం తిండివనం క్రిష్టియన్‌ మిషన్‌ స్కూలులో చదువుకొంటున్నాను. తిండివనం దక్షిణ ఆర్కాటులోనిది. ఆ ముందటిఏడే కామకోటి పీఠాధిపతులు శంకరాచార్యులు ఆఊరికి వేంచేసిరి. ఆర్కాటుకు పదిమైళ్ళ దూరంలోనూ, కాంచీపురానికి 25 మైళ్ళ దూరంలోనూ 'కలవై' అనే గ్రామమున్నది. ఆ గ్రామంలో శ్రీవారు సిద్ధిపొంది నారన్న వార్త అందింది. అంతేకాదు, మా పెద్దమ్మ కొడుకు మఠంలో ఋగ్వేదం అధ్యయనంచేస్తున్న బ్రహ్మచారిని, వారి స్థానంలో అనగా పీఠంమీద ఎక్కించారన్న మరొకవార్త కూడా అందింది.

మా పెద్దమ్మ వితంతువు. ఆమెకు ఏకైకపుత్రుడు. ఆకస్మిక సన్యాసం తీసుకొనేసరికి ఆమెకు ఊరటలేకపోయింది. మాతండ్రి ఆరోజులలో స్కూళ్ళసూపర్వైజరుగా ఉండేవారు. తిండివనానికి 60 మైళ్ళదూరంలో ఉన్న 'కలవై' గ్రామానికి సహకుటుంబంగా వెళ్ళుదామని అయన నిశ్చియించినారు. కానీ తిరుచునాపల్లిలో ఏదో విద్యావిషయక సమావేశమొకటి అడ్డుతగిలి ఆయన ప్రయాణం ఆగిపోయింది.

నాతోనూ, చిన్నపిల్లలతోనూ, అక్కగారిని ఊరడించడానికి మా అమ్మ ప్రయాణంకట్టింది. కంచివరకు రైల్లో ప్రయాణం. కంచిలో మఠంలోనే దిగినాము 'ప్రాతఃకృత్యాలు కుమారకోష్ఠము'లో పూర్తిచేసుకొన్నాము. ఆనాటికి ఆచార్య పరమగురువులు సిద్ధించిన పదోరోజు. మహాపూజకు కావలసిన సామాగ్రులకోసం మఠపు పరివారం కలవైనుండి కంచికి వచ్చి ఉన్నది. వారిలో, పారంపర్యంగా వస్తున్న మేస్త్రీ యొకడు, మా తల్లిగారికీ, పిల్లలకు వేరొకబండి ఏర్పాటుచేసి నన్ను మరొకబండిలో కూర్చోబెట్టి తనవెంట రమ్మని దారిదీశాడు.

కలవై గ్రామానికి పోతున్నప్పుడు నేను ఇంటికి మరల తిరిగి వెళ్ళడానికి వీలుండదనీ, జీవితాంతమూ, మఠంలోనే గడపవలసివస్తుందేమోనని మేస్త్రీ మెల్లగా సూచించాడు. మా అన్నగారు - పీఠాధిపులైనందున నన్ను తనతో ఉండగోరుతున్నారేమో అని అనుకున్నాను. నావయస్సు అప్పటికే పదమూడేకనుక, నావల్ల ఆయనకుగానీ మఠానికిగానీ కాగల ప్రయోజన మేమిటా అని అనుకున్నాను.

కలవై దగ్గరికొచ్చేకొద్దీ మేస్త్రీ విషయగోపనం విడిచి పెట్టినాడు. పూర్వాశ్రమంలో మా అన్నగారూన్నూ, ప్రస్తుత పీఠాధివులునూ అయిన శ్రీవారికి జ్వరం తగిలినదట. సన్నిపాతం కల్గినందున తన్ను తిండివనమునకే వెళ్ళి నన్ను తీసికొనిరమ్మన్నారట. కంచిలోనే కలవడము మేలైనదని త్వరత్వరగా తాను తీసుకొనిపోతున్నట్టు మేస్త్రీ చెప్పినాడు. నాకేమీ తోచలేదు. ఆబండిలోనే మోకరిల్లి 'రామరామ' యని రామనామం చెప్పుకుంటూ, నాకు అప్పటికి తెలిసినది అదేకనుక- అలాగే కూర్చున్నాను.

మా తల్లిగారూ, పిల్లలూ కొంతసేపయిన పిదపగాని రాలేదు. వచ్చుసరికి అక్కగారిని ఓదార్చుటకు బదులు నేను సన్యాసి అయినందున తన్నే ఇతరులు ఓదార్చవలసిన స్థితి ఏర్పడినది.

ఇంతకూ చెప్పవచ్చిన దేమిటంటే, కాషాయవస్త్రాలు స్వయంగా వైరాగ్యపూర్వకంగా నేను గ్రహించలేదని - వాటంతట అవే వచ్చినవి. పైగా గురుసాన్నిధ్యంలో అంతే వాసిత్వంచేస్తూ, బోధనందే భాగ్యానికినోచుకోకపోయినాను. సన్యాసంతో పాటు మఠాధిపత్యమూ దాని కష్టసుఖాలూనన్ను వెంటాడినవి.

అయితే నేను సన్యాసం పుచ్చుకొన్నపుడు కలవైలో ఇద్దరున్నారు. వారు తుమ్మలూరు రామకృష్ణయ్య, అడయపాలెం పశుపతి అయ్యరు. నాగురువుగారిశిష్యులు. దక్షిణ ఆర్కాటు జిల్లాకోర్టులో వారిఉద్యోగం. జీవితాన్ని తీర్చిదిద్దుకొనడంలో, వాళ్ళు నాకు సంపూర్ణసహకారం చేయడానికి తీర్మానించినట్లు తర్వాత వ్యక్తమైంది.

రామకృష్ణయ్య నిర్లిప్తుడైనా కుటుంబభార మెక్కువ. అందుచే నా భారాన్ని పశుపతియే వహించాల్సి వచ్చింది. ఈయన ముఖ్యంగా తనకాలన్ని ఐకాంతిక ధ్యానంలోనూ, భగవత్పాదుల ప్రకరణ గ్రంథాలను చదవటంలోనూ గడిపేవారు. నేను పీఠానికి రాగానే తన ఉద్యోగానికి పశుపతి రాజీనామాఇచ్చి నాతో ఉండడానికే సంకల్పించుకోన్నారు - నా వేషభాషలను సునిశితంగా చూచేవారు, తన ధ్యానకాలాన్ని కూడ తగ్గించుకొని మఠనిర్వహణంలో నిమగ్నులయ్యేవారు.

ఏకాంతగా కలిసికొని నావర్తనలో ఆయన గమనించిన దోషాలు నాకుచెప్పి, సంస్కరణకై పాటుపడవలెనని హెచ్చరించేవారు. ఒక్కొక్కప్పుడు కఠినంగాకూడా మందలించేవారు. ఉన్నతాశ్రమంలో ఉన్న వ్యక్తిపట్ల తాను చేస్తున్నది అపరాధమే అయినప్పటికి దానికీ క్షమాపణ నేను పెద్ద పెరిగిన తర్వాత చెప్పుకొంటానని అనేవారు.

అంతేకాదు, అయన తన స్నేహితులను కలిసినప్పుడు కూడా, జీవిత సంస్కారమునుగూర్చే మాట్లాడేవారు. ''ఐహిక విషయాలకోసం యిన్నేండ్లు ప్రాకులాడినావుకదా! ఇంత కష్టపడి నీవు ఆర్జించినదేమిటి? దౌర్బల్యం కొంచమయినా తగ్గిందా? వేదాంత బోధనలనూ, ఆచార్యుల ప్రకరణ గ్రంథాలలో సెలవిచ్చిన సూక్తులను ఆచరణలోనికి తెచ్చిచూడరాదా!'' అని అందరికీ బోధచేసేవారు.

స్నేహితులేకాదు, అపరిచితులైనాసరే, దారినిపోయే వారినికూడా అందరి కష్టసుఖాలనూ విచారించి అనునయ వాక్యాలుపలికి వారిని దైవభక్తులుగానూ, వేదాంతులుగానూ శంకరపాదుల సచ్ఛిష్యులుగానూ చేసేవారు.

1926 వరకు పెద్ధెనిమిదిఎండ్లు ఆయన నాతో పాటు శంకర భాష్యం చదువుతూ ఉండిపోయినారు. తర్వాత ఒకప్పుడు నేను యాత్రచేస్తూ కడలూరు గ్రామానికి వెళ్ళాను. పశుపతి అయ్యరు దీర్ఘకాంగా తమ సొంతగ్రామమైన కడలూరులో స్వగృహంలో అస్వస్థతతో ఉన్నారు. వూరేగింపు జరిగింది. వూరేగింపులోని మఠపుఏనుగు తొండమును పశుపతి అయ్యరు ఆదరపూర్వకంగా నిమురుతూ పరామర్శించారట, ఆరాత్రియేవారు గతించారన్న వార్త తెలిసింది.

ప్రీతి, భీతి ఏదీ అడ్డురాకుండా ఇతరులను ప్రేమిస్తూ, పరోప జీవనంకోసమే ప్రాణాలను అంకితం చేసినవారు పశుపతులు.

1923లో తిరుచునాపల్లి జిల్లాలో యాత్రచేస్తున్నాను. ఒక గ్రామంలో ఒక చిన్న అమ్మాయివయస్సు 12 కు మించదే. చిన్న తమ్ముణ్ణి గద్దిస్తున్నది. వాడుచేసిన నేరమేమిటంటే అబద్ధాలాడినాడట. సత్యాన్నే చెప్పాలనీ, బొంకులు బొంకి తమ్ముడు చెడిపోతున్నాడని ఆఅమ్మాయి ఆపిల్లవాడిని గద్దించడం చూస్తే మహాత్ముల ప్రబోధాన్ని మించినట్లుంది. ఎన్నో ఏండ్లు గడిచినా ఈ దృశ్యం మాత్రం నా స్మృతి పథంలో మెరుస్తూవే ఉంటుంది.

ఇంకొక సన్నివేశం కేరళంలో జరిగినది. ఒక సత్రం మాకు విడిదిగా ఇచ్చారు. ఒకగదిలో వయోధికులే, కొందరు నంబూద్రి బ్రాహ్మణులున్నారు. ఇష్టాగోష్ఠిలో, కొంతసేపయిన తరువాత వారిలోఒకరు పూజాసమయ మైనందున తన దేవతలుండే పెట్టెను తెరచి విగ్రహాలను వెలికితీసి పూజ కుపక్రమించినారు. అంతసేపూ లౌకిక సంభాషణ చేస్తున్నందువల్ల పూజకు అవసరమయిన పవిత్ర మనోభావంగానీ, వాతావరణంగానీ సంకల్పించుకోలేకపోయారు. యత్నం విఫలమైంది. అంతటితో లాభం లేదని లాంఛనంగా పూజ చేయడానికిబదులు స్వస్తి చెప్పడమే మేలని విగ్రహాలను పదిలపరచసాగాడు. ఆరాధనా విషయాలలో బాహ్య వేషంకన్న ఆంతర్యనైర్మల్యం, నిజాయితీ ముఖ్యమని ఇతని ప్రవర్తన చక్కగా చెప్పింది.

1929 వ సంవత్సరం ఉత్తర ఆర్కాటుజిల్లా పొలిమేరలో ఒక గ్రామంలో మాతో ఒక సన్యాసి కలిశాడు. ఆయనకు హిందీ మరాటీ తప్ప మరే భాషారాదు. రైల్లో రామేశ్వరందాకా వెళ్ళి తిరిగివస్తున్నాడట. ఈప్రయాణంలో తనదండాన్ని పోగొట్టుకున్నాడు. నేనుక్రొత్తదండం ఒకటి ఇప్పించినంతవరకు ఆయన ఉపవాసముండాలి. దండమిచ్చి తన ఆశ్రమం నిలిపినందులకు ఆయన నన్నే గురువుగా పరిగణించసాగాడు. అపుడాయనకు ఎనభై ఏళ్ళు. 1945 లో సిద్ధిపొందే వరకు నన్ను వదలి పోలేదు.

1929 లో మమ్ములను ఆయన కలసికొన్నంతనే చాతుర్మాస్య వచ్చింది. అపుడు నాకు నలుబదిరోజులు మలేరియా జ్వరం వదలక కాచినది. నాటివరకు నన్నెవరు తాకేవారుకారు. జ్వరతీవ్రతకు లేచినిలబడటానికికూడ శక్తి లేకపోయింది. క్రొత్తకావటంచేతనూ, సన్యిసి అవటంచేతనూ, నాకు ఆ సన్యాసి సహాయపడటానికి సిద్ధమైనాడు.

అయితే ఆయన చాలా కోపిష్ఠి. ఆయన కంఠస్వరం మేఘ గంభీరంగానూ, అధికారయుక్తంగానూ ఉండేది. ఆయన అంటే అందరికీ గడగడాట్‌. దేవాస్‌ సంస్థానంలో రెవిన్యూ ఇలాకాలో పనిచేసేవాడట.

ప్రతిరోజున్నూ ఆయన నాకు పాదపూజ చేసేవాడు. ఆయనను తప్పించడానికి ఎవరికీ చేతకాలేదు. పూజ జరుగుతున్నంతసేపు. భావోద్రేకంతో ఆయన నేత్రాలు బాష్పాంచితాలై చెక్కిళ్ళవరకు సోనలై జారేవి.

కంచిలో ఉన్నప్పుడు ఆయన బంధువు ఒకడు యాత్రకైవచ్చి ఆయనతో మాట్లాడినపిదప నన్ను కలుసుకొన్నాడు. 'ఈసన్యాసికి 100 ఏండ్లు కావస్తున్నది. మిమ్ములను గురువుగాను, దైవాధికంగా చూచుకొంటూ అనన్య శరణ్యంగా సహచరిస్తున్నాడుకదా. ఆయనను ఏమీగమనించక ముభావంగ ఉన్నారే' అనినాతో వాదులాడినాడు. దేనినిపట్టించుకోని నాస్వభావం అతని మాటలను లెక్కపెట్టలేదు.

ఒకప్పుడు మేము తిరుపతికి వెళ్ళిఉంటిమి. ఈస్వాములవారు క్రిందితిరుపతిలోనే ఉండిపోయిరి. మేము బాలాజీ దర్శనార్థం ఎగువతిరుపతికి వెళ్ళితిమి. బాలాజీ దర్శనం చేసుకొని క్రిందికి దిగబోతున్నామో లేదో, ఈశతవృద్ధు ఎగశ్వాసలతో ఏడుకొండలు ఎక్కివచ్చారు. ఆయన వయస్సు, ఆశ్రమము, మఠంతో ఆయనకుగల సంబంధమూ గమనించి, ఆలయాధికారులు, ప్రత్యేకంగా ఆయనకు దర్శనసౌకర్యం కల్పిస్తామని అన్నారు. కానీ ఆయన ఏదీ చెవిలో వేసుకోలేదు. నా పాదముల మీదపడి, 'నా బాలాజీ ఇదో ఇక్కడే వున్నాడు' అని బాలాజీ దర్శనం చేయకుండానే తిరిగి క్రిందికి దిగి వెళ్ళినారు.

ఈయనకాక మరి ఇరువురతో ఇలాగే ఒక సంబంధమేర్పడింది. ఈయనకూ వీరికీ మధ్యకాలం ముప్పదేళ్ళు. ఒకరినింకొకరెరుగరు కాని చర్యమాత్రం మువ్వురదీ ఒక్కటే.

వీళ్ళుకూడా నాపాదాలస్మరిస్తూ నన్ను గూర్చి సదా అలోచిస్తూ రాత్రింబగళ్ళు ఒకే ఆనందంలో ఉండిపోయెవారట. ఎంతటి దుఃఖాన్నైనా, లౌల్యానైనా వారు సులభంగా ఎదుర్కొనేవారట. కాని వారికి నాలోపాలు, స్వాభావిక అస్థిరత్వం తెలిసేసరికి ఇతరులను సైతం మాన్పేవారు. సదా నాపాదచింతనం చేయడంచేత నాకొక నియతి ఏర్పడుతున్నదని అనుకొన్నారు.

అటుతర్వాత వారున్నూ తమ కుటుంబభారాన్ని నెమ్మదిగా వదులుకొని, పూర్తిగా తమకాలాన్ని ధ్యానపూజాదులలో వినియోగిస్తూ, నా శ్రేయోలాభానికై పాటుపడుతూ ఉండేవారు.

జీవితం నేర్పిన దేమిటంటే, 'దేవుడు కొందరిని పరుల ప్రయోజనంకోసమే సృష్టిస్తూ ఉంటాడు' అని.


Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page